పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి: పవన్ కల్యాణ్

  • రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్
  • గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీలు
  • ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతానికి బోటులో వెళ్లిన పవన్

రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో కాలుష్య పరిస్థితిపై తనిఖీలు చేపట్టారు. వెంకటనగరం సమీపంలోని ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతాన్ని ఆయన బోటులో వెళ్లి స్వయంగా పరిశీలించారు. అక్కడ అధికారులతో నీటి నమూనాలను (శాంపిల్స్) సేకరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "పవిత్ర గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు కలవడం దారుణం. పుష్కరాల వేళ ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం మాట దేవుడెరుగు... రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏలూరులో తాగునీటి కాలుష్యం కారణంగా జరిగిన ప్రమాదాలను గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 


ఈ కాలుష్య సమస్యపై త్వరలోనే అసెంబ్లీ, కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. పుష్కరాల రేవులను కేవలం అందంగా తీర్చిదిద్దడమే కాదు, నది కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని మంత్రి కందుల దుర్గేష్‌ను ఉద్దేశించి పవన్ అన్నారు. పేపర్ మిల్స్ కాలుష్యంపై తాము నిఘా ఉంచామని, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు.


Pawan Kalyan
Godavari Pushkaralu
Andhra Paper Mills
River Pollution
Rajahmundry
Water Pollution
Environmental Protection
Andhra Pradesh
Kandula Durgesh
Nadendla Manohar

More Telugu News